కెనడాలో శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి

కెనడాలో హిందూ దేవాలయం మరోసారి దాడికి గురైంది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే నగరంలో గల ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన స్థానిక హిందూ సమాజంలో ఆందోళన రేకెత్తించింది.

ఆలయ అధికారుల కథనం ప్రకారం, శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేస్తూ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం ఆలయ ప్రవేశ ద్వారం, కొన్ని స్తంభాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, గోడలపై, స్తంభాలపై ఖలిస్థానీ ఉద్యమానికి మద్దతుగా రాతలు రాశారని పేర్కొన్నారు. దాడికి సంబంధించిన ఆధారాలు లభించకుండా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలను కూడా దుండగులు అపహరించుకుపోయారని ఆలయ ప్రతినిధులు వివరించారు.

భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే ఈ ద్వేషపూరిత దాడిని, విధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి చర్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టి, శాంతికి భంగం కలిగిస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 19వ తేదీన కూడా కొందరు ఖలిస్థానీ జెండాలతో ఆలయం వద్ద నిరసన తెలిపినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంపై జరిగిన దాడి వెనుక భారత వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

అందరూ ఏకం కావాలని ఎంపీ చంద్ర ఆర్య ట్వీట్

కెనాడాలో హిందూ ఆలయంపై దాడి పెరుగుతున్న ఖలిస్తానీ తీవ్రవాదానికి నిదర్శనమని భారత సంతతి కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయని సదరు ఎంపీ గుర్తు చేశారు. తాజాగా ఆలయంపై గీసిన రాతలు ఖలిస్తానీ తీవ్రవాదం పెరుగుతున్న ప్రభావాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.

ఖలిస్తానీ శక్తులు అత్యంత పక్కాగా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నాయని, వారికి భారీగా నిధులు సమకూరుతున్నాయని, అంతేకాకుండా గణనీయమైన రాజకీయ పలుకుబడి కూడా ఉందని ఎంపీ ఆరోపించారు. ఈ శక్తులు కెనడాలో నిర్భయంగా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాయని అన్నారు. హిందూ సమాజం గొంతును అణచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖలిస్థాని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Sri Lakshmi Narayana Temple
Canada Hindu Temple Attack
Surrey British Columbia
Khalistani Vandalism
Anti-India Forces
Chandra Arya MP
Hindu Temple Attack Canada
Religious Hate Crime Canada
Khalistan Movement

More Telugu News